కేసీఆర్ వర్సెస్ సోనియా.. మార్చి 13 డెడ్ లైన్..!

‘మూడో కూటమికి మళ్ళీ మూడొచ్చింది’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన.. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయనకు మజ్లీస్, జనసేన లాంటి లోకల్ పార్టీల నుంచి గట్టి మద్దతు లభించింది. ఉత్తరాది నుంచి సైతం ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తున్నట్లు ఆయనే చెప్పుకున్నారు. బీజేపీకి, కాంగ్రెస్ కీ సమాన దూరం పాటించే పార్టీల జాబితా ఇప్పటికే కేసీఆర్ సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి స్పష్టమైన సంకేతాలు ఏమీ రాకపోయినప్పటికీ.. త్వరలో జరిగే నేషనల్ టూర్లో కేసీఆర్ ఆయన్ను ఎట్రాక్ట్ చేయవచ్చని చెబుతున్నారు. అటు.. థర్డ్ ఫ్రంట్ అనౌన్స్ మెంట్ చేసిన రోజే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసీఆర్ కి ఫోన్ చేసి అభినందన తెలిపినట్లు తెరాస వర్గాలు చెప్పాయి.

కేసీఆర్ ‘జాతీయ కసరత్తు’ మీద ప్రధాని మోదీ, బీజెపీ చీఫ్ అమిత్ షా ఇప్పటికే ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇలా సాగుతుండగానే.. యాదృచ్చికంగా.. సోనియా గాంధీ ‘యాంటీ బీజేపీ మూవ్ మెంట్’ ని మొదలుపెట్టేశారు. ఈనెల 13 మంగళవారం.. బీజేపీయేతర పార్టీల అధినేతలందరికీ విందు ఏర్పాటు చేసిన సోనియాగాంధీ.. యూపీఏకి మళ్ళీ చక్రాలు బిగించే పనిలో పడ్డారు. అయితే.. ప్రస్తుతం కాంగ్రెస్ కున్న బలం, బలగం దృష్ట్యా సోనియా పిలుపునకు సరైన స్పందన లభించడం లేదన్నది తాజా ఊసు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోనియా విందుకు హాజరు కాబోవడం లేదని తెగేసి చెప్పింది. కానీ ఇప్పటికీ మంతనాలు కొనసాగుతున్న క్రమంలో .. దీదీ తరపున ఎవరైనా ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. తాను సోనియా సమక్షంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకోవడంతోనే మమతా బెనర్జీ.. కేసీఆర్ ఐడియాకు సింక్ అయ్యిందని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అటు.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం సోనియా డిన్నర్ కు డుమ్మా కొట్టాలనే నిర్ణయించుకున్నారు.

సోనియా స్కోర్ తగ్గుతోందంటే.. కేసీయార్ ‘బలం’ పెరిగినట్లేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలు కొద్దికొద్దిగా ‘సోనియా వర్సెస్ కేసీఆర్’ ట్రెండ్ లోకి మారుతుండడాన్ని ఢిల్లీలో ప్రధానంగా చర్చించుకుంటున్నారు. తెరాస ప్లీనరీ సమయానిగ్గాని ‘గులాబీ జాతీయ దండు’ మీద క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.  2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ‘పొత్తు’ ఆఫర్ ని తెరాస తిరస్కరించినప్పుడే.. సోనియా-కేసీఆర్ ల మధ్య విభేదాలు మొదలయ్యాయని.. అవి ఇప్పటికి తుదిరూపు సంతరించుకున్నాయని, ఈ వైరం ఇంకెన్ని పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేమని.. రాజకీయ తటస్థుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.