బెంగాల్ ఎన్నికల్లో బీజేపీతో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అంటుంది. 8 దశల ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపర్చింది. తను స్వయంగా రెండు చోట్ల నుండి పోటీలో ఉంటారని అంతా భావించినా… కేవలం నందిగ్రామ్ నుండి మాత్రమే బరిలో ఉండాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది.
మొత్తం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా 20మంది ఎమ్మెల్యేలకు, ఇద్దరు మంత్రులతో పాటు 80సంవత్సరాలు దాటిన వారికి పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. మరో మూడు సీట్లను కలిసొచ్చే పార్టీలకు కేటాయించబోతున్నారు. ప్రకటించిన జాబితాలో 50మంది మహిళలు, 42 మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు, 79మంది ఎస్సీ సామాజిక వర్గం, 17మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చారు.
తన భవానీపూర్ స్థానం నుండి వెటరన్ లీడర్ సోవన్బ్ చటర్జీకి అవకాశం ఇచ్చారు. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ బీజేపీ నుండి బరిలో ఉన్న సువేందు అధికారిపై పోటీ చేయనున్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ లో టీఎంసీ నుండి గెలిచి మంత్రిగా పనిచేశారు. కానీ ఇటీవలే బీజేపీలో చేరారు.