ప్రభుత్వ దుకాణాల నుంచి విక్రయించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల ధరలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తగ్గించారు. అదే సమయంలో ఇంధన ధరలను తగ్గించాలని, టోల్ పన్నును తాత్కాలికంగా మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. ధరల పెరుగుదలను నియంత్రించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ ధరలను తగ్గించేందుకు, ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టోల్ ట్యాక్స్ తీసుకోవడం మానేయాలని సూచించారు. ఇది వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతోందన్నారు.
మరో ఐదేండ్ల పాటు జీఎస్టీ కాలపరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో రాష్ట్రాలు జీతాలు చెల్లించగలవో? లేదో ? అని తనకు అనుమానంగా ఉందన్నారు.
ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ పార్టీ పావులుగా వాడుకుంటోందన్నారు. ప్రభుత్వం తన దృష్టిని ప్రతిపక్ష నేతలపై కాకుండా ధరలను నియంత్రించడంపై ఉంచాలని సూచించారు. అంతకు ముందు భారత ఆర్థిక పరిస్థితి శ్రీలంక కన్నా అధ్వాన్నంగా ఉందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.