దైవ దూషణ చేశాడని, ఖురాన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ పాకిస్తాన్ లో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. లాహోర్ కి సుమారు 80 కి.మీ. దూరంలోని వార్ బర్దన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మహమ్మద్ వారిస్ అనే ఇతడిపై కొందరు దాడి చేయగా పోలీసులు వారి నుంచి తప్పించి ఇతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో లాకప్ లోపెట్టారు. అయితే దీంతో శాంతించని కొన్ని గుంపులు నిన్న పోలీసు స్టేషన్ పై దాడి చేసి అతడిని బలవంతంగా బయటకు తీసుకువచ్చి.. సజీవ దహనం చేయబోయారు.
పోలీసులు అడ్డుకోబోగా వారిని నెట్టివేసి వారిస్ ని నగ్నంగా చేసి కొట్టుకుంటూ వీధి అంతా తిప్పి రాళ్లతో కొట్టి చంపారు. మైనర్లు సైతం పోలీసు స్టేషన్ గేట్లు ఎక్కి.. లోపలికి ప్రవేశిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన గుంపులను చూసి పోలీసులు కూడా చేతులెత్తేశారు.
దైవ దూషణ చేసేవారినివారినీ క్షమించే ప్రసక్తి లేదని, పైగా పవిత్ర గ్రంథాలపై ఈ వ్యక్తి తన మాజీ భార్య ఫోటోలను అతికించి చేతబడికి పూనుకొన్నాడని ఈ గుంపులో కొందరు పేర్కొన్నట్టు జియో న్యూస్ తెలిపింది.
ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని పాక్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ ఆదేశించారు. హింసకు పాల్పడినవారు పోలీసు స్టేషన్ లోకి ప్రవేశించకుండా వారిని ఖాకీలు ఎందుకు నివారించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతులోకి తీసుకోకుండా చూడాలని కూడా ఆయన డీజీపీని ఆదేశించారు. గతంలో కూడా ఈ విధమైన అమానుష ఘటనలు జరిగాయి. పంజాబ్ లోని సియాల్ కోట్ లో శ్రీలంకకు చెందిన వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. వీరిలో ఆరుగురికి కోర్టు మరణశిక్ష విధించింది.