అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో రెచ్చిపోయిన అన్న.. తమ్ముడు, అతని భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన హుస్నాబాద్ లోని ధూళిమిట్ట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ధూళిమిట్ట మండలం హనుమతండ గ్రామ పంచాయతీ సీబీ తండాకు చెందిన ధరావత్ దీప్లా, థావూరియా అన్నదమ్ములు.
ఇందులో థావూరియాకు నాలుగు ఎకరాల భూమి, దీప్లాకు ఎకరన్నర భూమి ఉంది. థావూరియా దివ్యాంగుడు అవడం చేత అన్న దీప్లా తమ్ముడిని ఎకరం భూమి కానీ, లేదా పది లక్షలైనా ఇవ్వమని వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా నాకున్న రాజకీయ పలుకుబడితో నీ భూమిని మొత్తం కాజేస్తానని బెదిరించేవాడు.
ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం థావూరియాపై గొడవకు ధరావత్ ఇంట్లో ఉన్న గొడల్లితో తమ్ముడు భార్య సునీతపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సునీతను ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాజు, పైలెట్ సతీష్ రెడ్డిలు ఆస్పత్రికి తరలించారు.
గతంలో కూడా దీప్లా ఇలాగే గొడవలకు దిగేవాడని, బెదిరింపులకు గురిచేసేవాడని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.