కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాల్లో కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళితే… సోన్ మండలం సంగంపేట్ గ్రామానికి చెందిన గొర్ర లింగన్నకు స్థానికంగా నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఇటీవల గ్రామ వీడీసీ సభ్యులు కక్ష సాదింపు చర్యలో భాగంగా తన వ్యవసాయ భూమి చుట్టు కందకం ఏర్పాటు చేసి దారి వేశారంటూ లింగన్న ఆరోపించారు.
ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేండ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా తన సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదని లింగయ్య ఆవేదన చెందారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్ రాంబాబును ఆయన కలిశారు. తన సమస్యను గురించి అదనపు కలెక్టర్ కు వివరించారు.
అధికారుల నుంచి స్పందన రావడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు లింగయ్యను అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.