ప్రధాని మోడీని చంపుతానంటూ ఓ వ్యక్తి నిన్న రాత్రి ఢిల్లీ లోని పోలీసు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ కాల్ ను ట్రేస్ చేసి నగరంలోని ప్రసాద్ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హేమంత్ కుమార్ అనే 48 ఏళ్ళ వ్యక్తి మద్యం మత్తులో ఈ బెదిరింపు కాల్ చేశాడని, ఇతడిని అదుపులోకి తీసుకున్నామని ఖాకీలు తెలిపారు.
ఇతడిని రాయ్ గర్ పుర, కరోల్ బాగ్ పోలీసు స్టేషన్లకు తీసుకువచ్చి విచారిస్తున్నామన్నారు. నిందితునికి గత ఆరేళ్లుగా ఉద్యోగం లేదని, మద్యానికి అలవాటు పడి ఇలా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.
తనకు ఉపాధి లేదన్న కోపంతో ప్రధానిని హతమారుస్తానంటూ హేమంత్ కుమార్ బెదిరిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇతని నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
గతంలో కూడా మోడీని చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీస్ ఎమర్జెన్సీ నెంబరు 100 కి ఫోన్ చేసి మోడీకి హాని చేస్తానని తెలిపాడట. ఇతడిని యూపీలోని నోయిడాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇలాంటి కాల్స్ పట్ల ఢిల్లీతో బాటు యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. కాల్ అందినవెంటనే ఎక్కడి నుంచి, ఎవరు చేశారన్నదానిపై ఆరా తీస్తున్నారు.