ఎక్కడైనా పాము మనిషిని కాటేస్తే వెంటనే దాన్ని చంపేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను కాటేసిన పామును ఓ సీసాలో భద్రంగా బంధించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అసలు ఆ వ్యక్తి ఎందుకు ఆ పామును సీసాలో పెట్టాడు..? ఆసుపత్రికి ఎందుకు తీసుకుని వెళ్లాడు..? అనే విషయాలు తెలియాలంటే ఈ వార్త చదివేయాల్సిందే…
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లోని అఫ్జల్ నగర్ లోని మఖి పోలీస్ సర్కిల్ పరిధిలో నివసించే రామేంద్ర యాదవ్ భార్యను పాము కాటేసింది. దీంతో వెంటనే అతను పామును ఓ ప్లాస్టిక్ సీసాలో బంధించాడు. అంతే కాకుండా భార్యతో పాటు ఆ పామును కూడా ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. ఆసుపత్రి సిబ్బంది పామును ఎందుకు తీసుకుని వచ్చావ్? అని ఆ వ్యక్తిని అడగగా… అతను ఇచ్చిన సమాధానం విని నోరెళ్లబెట్టాడం సిబ్బంది వంతయ్యింది.
‘నా భార్యకు ఏ పాము కరిచిందని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే పామును కూడా తీసుకుని వచ్చాను. ఇక ఏ పాము కరిచిందో మీరే చూసుకోని వైద్యం చేయొచ్చు అని వింతగా సమాధానం చెప్పాడు. తన భార్య ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే పామును సమీపంలోని అడవిలో విడిచి పెడతానని‘ కూడా చెప్పాడు.
సీసాలో ఉన్న పాముకు గాలి ఆడటానికి సీసాకు రంధ్రాలు కూడా చేశానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.