ఏపీలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలో కాపీయింగ్ జరిగింది. విజయవాడ బెంజి సర్కిల్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ వెలుగు చూసింది. ఉదయం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న కొల్లూరు వెంకటేశ్ అనే అభ్యర్థి ఏకంగా మొబైల్ తీసుకొచ్చాడు. మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేసి జవాబులు చూసి రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ గ్రూప్ 1 పరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగ 75 శాతానికిపైగా హాజరైనట్లు తెలుస్తోంది. ప్రశ్నల సరళి విధానంపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వెల్లడైంది. పలు ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉందని.. వాటిని చదివి అర్థం చేసుకునే సరికి సమయం అంతా అయిపోయిందని అభ్యర్థులు తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు గర్తించలేక పోయామని వాపోయారు. రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉండే ఈ పోస్టులకు ఆ మాత్రం పేపర్ స్టాండర్డ్ ఉండాల్సిందే అంటూ కొంత మంది అభ్యర్థులు తెలిపారు.
ఇక ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు మూడు వారాల్లోకి వెల్లడికానున్నాయి. ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. ఈ సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా తెలిపారు.