పిచ్చి పలురకాలని ఊరికే అన్నారా..! ఇంటిని ఆకర్షణీయంగా అలంకరించడానికి ఎవరైన రకరకాల కుండీలు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు, ఫ్యాన్సీ క్రాకరీ, ల్యాంప్స్, శిల్పాలతో అలంకరిస్తుంటారు. ఇది సర్వసహజం. కానీ ఓ వ్యక్తి భయంకరంగా ఆలోచించాడు.
తన ఇంటిని గ్రెనేడ్‌లతో అలంకరించాడు. కానీ అవి పనిచేసేవని గ్రహించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు..వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి లైవ్ గ్రెనేడ్‌లను తొలగించారు. విస్తుపోయే ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది.
సమ్మర్ కోర్ట్ లోని కార్నివాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటిని అలంకరించేందుకు మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లను కొనుగోలు చేశాడు. ఇంట్లోని ఒక చోట వాటితో డెకరేట్ చేశాడు. కాగా, జనవరి 31న రొటీన్ తనిఖీల సందర్భంగా ఆ ప్రాంత పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఇంట్లో అలంకరించినవి లైవ్ గ్రెనేడ్లు అని గుర్తించి షాకయ్యారు.
వాటిని తొలగించేందుకు రాయల్ నేవీకి చెందిన ఎక్స్ ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బృందాన్ని రప్పించారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆ ఇంటి సమీపంలోని రోడ్డును మూసివేశారు.
అలాగే సేఫ్టీ కోసం పొరుగు ఇంట్లోని వారిని కూడా ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని మూడు లైవ్ గ్రెనేడ్‌లను ఆ ఇంటి నుంచి తొలగించింది. వాటిని దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసింది.
మరోవైపు ఇంటి అలంకరణ కోసం కొనుగోలు చేసిన గ్రెనేడ్లు పేలేవి అన్న సంగతి తనకు తెలియదని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ అధికారి వెల్లడించారు.