దుస్సాహసాలకు పోతే ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ స్టంట్లకు పోతున్నారు యువకులు. అందులోనూ వేగంగా వెళ్తున్న రైల్లో చివరి ఫుట్ బోర్డు పై నిలబడి గాల్లో తేలుతున్నట్టు చేసే విన్యాసాలు ఎంత డేంజరో చెప్పలేం. పంజాబ్ లోని లూధియానాలో ఓ యువకుడు ఇలాగే మాల్వా ఎక్స్ ప్రెస్ రైల్లో స్టంట్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇతని తల విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో అక్కడికక్కడే కిందపడి మరణించాడు.
ఈ నెల 6 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చావా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను రైల్వే అధికారులు విడుదల చేశారు. ఇలాంటి డేంజరస్ విన్యాసాలు చేయరాదని తాము ఎంతగా హెచ్చరిస్తున్నా.. కొందరు యువకులు పట్టించుకోకుండా దుస్సాహసాలకు దిగుతున్నారని వారు పేర్కొన్నారు.
ఈ సంఘటనలో మృతుని వద్ద ఎలాంటి ఐడెంటిటీ కార్డు గానీ, మొబైల్ గానీ లభించలేదన్నారు. బహుశా 30 ఏళ్ళ వయస్సువాడై ఉంటాడని, ఇతని స్టంట్ ని వీడియో తీస్తున్న ప్రయాణికుడు ఇతనికి తెలిసినవాడే అయి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. తనను పోలీసులో లేదా అధికారులో పట్టుకోవచ్చునని భయపడి ఎవరితోనూ మాట్లాడలేదని వారన్నారు. మృతుని తాలూకు వారి కోసం 72 గంటల పాటు వేచి చూశామని, ఎవరూ రాకపోయేసరికి అటాప్సీ నిర్వహించి సోమవారం అతని అంత్యక్రియలు చేసినట్టు అధికారులు తెలిపారు.
టిక్ టాక్ వంటి వీడియోలు యువతపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని, దీనివల్ల వారి ప్రాణాలకే ప్రమాదమన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారని పెద్దలు ట్వీట్లు చేస్తున్నారు.