ఓ ఏటీయం వరాల జల్లు కురిపించింది. రూ.500 డ్రా చేస్తే రూ.2,500 ఇచ్చింది. మరి మేటర్ మామూలుగా ఉంటుందా.! అందరూ ఆ వరాల ఏటీయంకి క్యూలు కట్టారు. పాపం..! వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చేయడం మొదలుపెట్టింది. ఏంటి?! ఆ ఏటీయం అడ్రస్ చెప్పమంటారా..! ? అది మూతబడ్డాకా దాపరికమేముంది..!
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఏటీఎంలో రూ. 500 డ్రా చేస్తే రూ. 2,500 వచ్చాయి. విషయం ఒకరి ద్వారా మరొకరికి వ్యాపించడంతో స్థానికులు ఏటీఎం వద్దకు చేరుకుని డబ్బులు డ్రా చేసేందుకు పోటీ పడ్డారు.
శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి హరిబౌలి చౌరస్తాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి రూ. 500 డ్రా చేశాడు. అయితే, రూ. 500కు బదులుగా ఏటీఎం నుంచి రూ. 2,500 వచ్చాయి. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే విషయం తెలుసుకున్న స్థానికులు ఏటీఎం వద్దకు చేరుకుని, డబ్బులు డ్రా చేసేందుకు పోటీ పడ్డారు.
ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు రూ. 500 డ్రా చేస్తే రూ. 2,500 వస్తున్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. దాంతో ఏటీఎం కేంద్రాన్ని మూసివేయించి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.