బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ కేంద్రంలో… ఓ పులిని శనివారం కాల్చి చంపారు. మనిషి రక్తం రుచి మరిగిన ఈ ‘మ్యాన్ ఈటర్’ కొన్ని నెలలుగా 9 మందిని చంపి తిన్నదని ఈ కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనికి మత్తుమందు ఇచ్చి జూకి తరలించడానికి చేసిన అన్ని యత్నాలు విఫలం కావడంతో ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ (కనిపిస్తే కాల్చివేత) ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఈ పులి ఓ మహిళను, ఆమె ఏడేళ్ల కూతురిని చంపేసింది. అంతకు ముందు పొలంలోకి వెళ్లిన ఓ వ్యక్తి కూడా దీని బారిన పడ్డాడు, దగ్గరలోని గ్రామీణ ప్రాంతాలవారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ క్రూర జంతువు మరణించడంతో అటు అధికారులు, ఇటు సమీప గ్రామాలవారు ఊపిరి పీల్చుకున్నారు.
దీన్ని చంపడానికి హైదరాబాద్ నుంచి ప్రముఖ వైల్డ్ లైఫ్ హంటర్ అయిన నవాబ్ షఫత్ అలీని బీహార్ ప్రభుత్వం రప్పించింది. అయితే ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా పులి తప్పించుకుంటూ వచ్చింది. గత నెల 28 న ఎరగా వేసిన మేకపై దాడి చేసిన ఇది ఆయన కళ్ళముందే తప్పించుకుపోయినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
హరిహర్ పూర్ అనే గ్రామంలో ఈ పులి ముప్పుతిప్పలు పెట్టినట్టు వారు చెప్పారు. నాలుగు సంవత్సరాల ఇది మనుషులపై ఎందుకు దాడులకు దిగిందో తెలియడం లేదన్నారు చివరకు బాగహా ప్రాంతంలోని చెరకు తోటలో దీన్ని చూసిన 8 మంది షార్ప్ షూటర్లు నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో అది మరణించిందని వీటీఆర్ డైరెక్టర్ నేస్ మణి తెలిపారు.
ఈ పులి వధ కోసం, 400 మంది అధికారులతో అనేక బృందాలు ఇన్ని నెలలుగా పాటుపడ్డాయి. లోగడ ఈ రాయల్ బెంగాల్ టైగర్ కి, మరో పులికి మధ్య భీకర పోరాటం జరిగిందని, ఫలితంగా ఇది గాయపడిందని స్టేట్ చీఫ్ వైల్డ్ వార్డెన్ పీకే. గుప్తా చెప్పారు. దీని శరీరంపై గాయాల గుర్తులున్నాయన్నారు. అటవీ ప్రాంతంలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఇది తెలిసిందన్నారు. ఆ పులికి భయపడి ఇది అటవీ ప్రాంతాలను వదిలి జనావాస ప్రాంతాలపై పడేదని భావిస్తున్నామన్నారు. మొత్తానికి శనివారం షూటర్లు దీని కథను ముగించారు.