చేతిలో సెల్ ఫోన్. బుర్రలో క్రియేటివిటీ..వెరసి ఓ విచిత్రమైన సెల్ఫీ కోసం విన్యాసం. అంతే..! టైమ్ బావుంటే సెల్ఫీవస్తుంది.లేదంటే భూమ్మీద అతని టైమ్ అయిపోతుంది. కోతులతో సెల్ఫీ తీసుకుందామని ట్రైచేసిన వ్యక్తి ప్రమాద వశాత్తు లోయలోపడి మరణించిన ఘటనమహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది.
అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా భోర్ నుంచి కొంకణ్ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వరందా ఘాట్ రోడ్‌లో ఉన్న వాఘ్‌జాయ్ గుడి వద్ద కారును ఆపాడు. ఆ ప్రాంతంలో కోతుల గుంపు కనిపించడంతో వాటితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.
కోతుల్లో ఒకడుగా కవర్ చేసుకోవాలనే ప్రయత్నంలో కొండ పైనుంచి జారి లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనికోసం గాలింపు చేపట్టారు. లోయలో 500 మీటర్ల దిగువన అతని మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సహాయంతో అతడిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.