యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించి, ఆపై ఫ్లైట్ అటెండెంట్‌ను గొంతుపై పొడిచిన ఓ ప్రయాణికుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. లాస్ ఏంజెల్స్-బోస్టన్ మధ్య విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి, సిబ్బంది గొంతుపై కత్తితో దాడి చేసిన ఆరోపణలపై లియోమిన్‌స్టర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తెలియజేసింది.
నిందితుడి పేరు ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్. అతడు విమానానికి ఆటంకం కలిగించడంతో పాటు విమాన సిబ్బంది, సహాయకులపై ప్రమాదకరమైన ఆయుధాన్ని ఉపయోగించాడని పోలీసులు అభియోగాలు మోపారు. దీంతో టోరెస్ ను ఆదివారం సాయంత్రం బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి మార్చి 9న కోర్టులో హాజరుపరిచారు.
టోర్రెస్ లాస్ ఏంజెల్స్ నుంచి బోస్టన్ వెళ్లే విమానం ఎక్కాడు. ల్యాండింగ్‌కు దాదాపు 45 నిమిషాల ముందు కాక్‌పిట్‌లో ఫస్ట్ క్లాస్, కోచ్ సెక్షన్‌ల మధ్య ఉన్న స్టార్‌బోర్డ్ సైడ్ డోర్ అన్‌లాక్ అయ్యిందని విమాన సిబ్బందికి అలారం వచ్చింది. ఏం జరిగిందని ఆరా తీస్తే డోర్ లాక్ హ్యాండిల్ తొలగించబడిందని విమాన సహాయకురాలు గమనించింది. దీంతో సిబ్బందికి ఆమె ఈ సమాచారాన్ని అందించింది. టోరెస్ అనే ప్రయాణికుడు తలుపు దగ్గరే ఉన్నాడని, అతడే తలుపు తెరవడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపింది.
వెంటనే సహాయకురాలు టోరెస్‌తో ఈ విషయంలో మాట్లాడింది. దీంతో అక్కడ కెమెరాలు ఉన్నాయా ? తానే డోర్ అన్ లాక్ చేశానని ఎలా చెపుతున్నారని అతడు ప్రశ్నించారు. దీంతో టోరెస్ వల్ల విమానానికి ప్రమాదం ఉందని, వీలైనంత తొందరగా ల్యాండ్ చేయాలని ఆమె కెప్టెన్ ను కోరింది. ఈ సమయంలో అతడు ఆమెపై విరిగిన చెంచాతో ఆమె గొంతులోకి పొడిచాడు.
ఆ తర్వాత విమానంలో కూర్చున్న ప్రయాణికులు పరిస్థితిని చక్కదిద్దారు. విమానం బోస్టన్‌లో దిగిన తర్వాత టోరెస్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ చర్యకు పాల్పడిన నిందితుడికి 5 సంవత్సరాల శిక్ష 2.5 మిలియన్ డాలర్ల జరిమాన పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.