జీ 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇండియాకు గర్వ కారణమని, ఇది మనకు లభించిన మహదావకాశమని ప్రధాని మోడీ అన్నారు. ‘అమృత్ కాల్’ కింద భారత దేశానికి దక్కిన ఈ అపూర్వ అవకాశం తమకెంతో గర్వంగా భావిస్తున్నామని దేశవ్యాప్తంగా ప్రజలు తనకు లేఖలు రాశారని ఆయన తెలిపారు. జీ 20 ప్రెసిడెన్సీ బాధ్యతల నేపథ్యంలో ప్రపంచానికి మంచి జరిగేందుకు, శాంతి, సమైక్యత, అభివృద్ధి అన్న అంశాలపై దృష్టి పెట్టేందుకు మనం కృషి చేయాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్లకు ఇండియా వద్ద పరిష్కారం ఉందన్నారు.
ఆదివారం తన 95 వ దఫా ..’మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో మోడీ.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు అన్న థీమ్ ని పదేపదే ప్రస్తావించారు. డిసెంబరు 1 నుంచి ఇండియా.. జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ఈ కారణంగా ఆయన ప్రధానంగా ఈ అంశాన్ని తన ప్రసంగంలో పేర్కొంటూ.. ఈ అవకాశాన్ని మన దేశం సమర్థంగా వినియోగించుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో విజయాలను కూడా ఆయన గుర్తు చేశారు. ..
అంతరిక్షంలోకి విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఈ రంగంలో దేశం సాధించిన అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. ప్రైవేటు రంగంలో ఈ రాకెట్ ని డిజైన్ చేసి అభివృద్ధి పరిచారని, ఇందులో ఎన్నో కొత్త వ్యవస్థలు ఉన్నాయని మోడీ చెప్పారు. స్పేస్ సెక్టార్ (రంగం) లో సాధిస్తున్న విజయాలను ఇండియా తన పొరుగుదేశాలతో షేర్ చేసుకుంటున్నదని, సముద్ర వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని ని ఇండియా, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి పరిచాయని మోడీ పేర్కొన్నారు. భారత.భూటాన్ దేశాల మధ్య సత్సంబంధాలకు ఇది ఉదాహరణ అన్నారు. యువతకు ఆకాశమే హద్దు కాదని, వీరు ఎన్నో విజయాలు సాధిస్తారన్న విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు.
తన మన్ కీ బాత్ ప్రసంగంలో మోడీ.. జీ-20 సమ్మిట్ లోగోకి సంబంధించిన నేతనేసి తనకు బహుమతిగా ఇచ్చిన తెలంగాణ వాసిని ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడు తనకు ఈ అద్భుతమైన గిఫ్ట్ ని పంపారని ఆయన తెలిపారు. దీన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఇది ‘ఎమేజింగ్ గిఫ్ట్’ అని అభివర్ణించారు. హరిప్రసాద్ వంటి అనేకమంది జీ-20 ప్రెసిడెన్సీ ని ఇండియా చేబట్టడం తమకు గర్వకారణమంటూ తనకు లేఖలు రాశారన్నారు.