భార్యను గొంతునులిమి హత్య చేసి.. తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు భర్త. ఈ ఘటన ఝార్ఖండ్ లోని గిరిడీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిరిడీకి చెందిన మనీష్ బర్న్ వాల్ అనే వ్యక్తి అర్జుమన్ బానో అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇద్దరు బాగానే ఉంటున్న తరుణంలో.. దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. అర్జుమన్ తమ మొదటి భర్త సోదరుడితో తరుచూ ఫోన్ లో మాట్లాడేది. ఇది గమనించిన మనీష్ మాట్లాడవద్దని హెచ్చరించాడు.
అయినా అర్జుమన్ పట్టించుకోలేదు. దీంతో భార్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు మనీష్. అయితే 2021లో దుర్గా పూజలకు తన భార్య , కూతురితో కలిసి కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో రాత్రి 9 గంటల సమయంలో బగ్దీచౌక్ వద్ద అర్జుమన్ తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతుంది. కూతురికి కుందేలును చూపించి వస్తానని మనీష్ తన భార్యకు చెప్పాడు. అయితే భార్యను చంపేందుకు ఇదే సరైన సమయమని భావించిన అర్జుమన్.. చున్నీతో ఆమెను దారుణంగా హత్య చేశాడు.
అనంతరం ఆమె మృతదేహాన్ని మాల్దాకు తీసుకెళ్లి తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పాతి పెట్టి సిమెంట్ తో పూడ్చి పెట్టాడు. దాదాపు మూడు నెలల తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు మనీష్. పదే పదే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య గురించి అడిగేవాడు. దీంతో ఈ కేసుపై ఎస్పీ అమిత్ రేణు వారం రోజుల క్రితం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ క్రమంలో మనీష్ పై అనుమానమొచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్నేహితుడి ఇంట్లో తవ్వి చూడగా.. మృతదేహం లభించింది. ఈ ఘటనపై మనీష్ పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.