కొన్నిసార్లు చిన్నపాటి గొడవలే వ్యక్తుల ప్రాణాలు తీసేంత వరకు వెళ్తాయి. ఇలాంటి సంఘటనలను ఇప్పటి వరకు మనం చాలా చూశాం. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లోనూ ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నగరంలోని లంగర్ హౌజ్‌కు చెందిన వికాస్ (34) అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం తన స్నేహితుడు బబ్లుతో కలిసి ఉప్పల్‌లో ఉన్న మహంకాళి వైన్స్‌లో ఇద్దరూ మద్యం సేవించారు. కాగా వైన్ షాపుకు ఉన్న పర్మిట్ రూమ్‌లో వారు మద్యం సేవించగా అక్కడే ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేశారు.
అయితే ఆమ్లెట్‌కు రూ.60 ఇవ్వాలని వైన్ షాపు సిబ్బంది అడగడంతో వికాస్‌కు వారికి మధ్య గొడవ జరిగింది. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో వికాస్, బబ్లు ఓ వైపు, మరో వైపు వైన్‌షాప్ సిబ్బంది పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో బబ్లు, వికాస్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వికాస్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించగా అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వైన్‌షాప్ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.