చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొట్టేలు అనుకొని మనషి తల నరికేయడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లిలో జరిగింది. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న వేళ ఈ ఘటన జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
మదనపల్లె సమీపంలో వలసపల్లెలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి చుట్టుపక్కల ప్రజలంతా వెళ్లి పూజలు నిర్వహించారు . మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు సురేష్ అనే యువకుడు పొట్టేలును తీసుకొని వచ్చాడు. అదే గ్రామానికి చెందిన చలపతి పొట్టేలుని నరకబోయి.. మద్యం మత్తులో సురేష్ తలను నరికేశాడు.
దీంతో సురేష్ అక్కడే కుప్పకూలిపోగా.. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చలపతిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటన పొరపాటున జరిగిందా.. ఇంకేవైనా కారణాలు ఉన్నాయో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు ఈ ఘటనతో చల్లబడిపోయాయి. స్థానికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయనకు భార్య ఇద్దరి పిల్లలు ఉన్నారు.