తన భార్యాపిల్లల్ని గాలికి వదిలేసిన భర్తకు వారిని పోషించవలసిన అవసరం ఎంతయినా ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కూలీ పని చేసైనా సరే.. ఇది భర్త బాధ్యత అని పేర్కొంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 125 సెక్షన్ కింద ఇది అతని సామాజిక బాధ్యత.. తన భార్య, చిన్న పిల్లలను పోషించడానికి దీన్ని నెరవేర్చక తప్పదు అని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. తన బిజినెస్ పోయిందని, తనకు ఆదాయం సంపాదించే మార్గం లేదని, తన భార్యను, మైనర్ బాలుడిని తాను పోషించలేనని పంజాబ్ లోని ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను బెంచ్ తోసిపుచ్చింది.
నీ ఆరోగ్యం బాగానే ఉంది గనుక చట్టబద్ధమైన ఏ పని అయినా చేసి వారిని పోషించాలని న్యాయమూర్తులు అతడిని ఆదేశించారు. నీ భార్యాపిల్లలను సరిగా చూసుకోవడంలో నువ్వు విఫలమయ్యావు అని చీవాట్లు పెట్టారు. ఈ కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు లోపభూయిష్టంగా, సాదాసీదాగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యక్తి ఫ్యామిలీ కోర్టు కెక్కగా.. ఇతని వాదన సబబుగానే ఉందని ఆ కోర్టు అభిప్రాయపడిందని, దాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.
తన భర్త తనను, తన సంతానాన్ని పట్టించుకోకుండా వదిలివేశాడని, అతని నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తికి కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆమెకు నెలకు 10 వేల రూపాయలు, మైనర్ బాలుడికి 6 వేలు మెయింటెనెన్స్ కింద చెల్లించాలని ఆమె భర్తను ఆదేశించింది. వారు తమ జీవితాన్ని సవ్యంగా గడిపేలా అన్ని ఏర్పాట్లు చేయాలనీ సూచించింది.