తమిళనాడు ప్రజలకు తమ భాషపై అభిమానం ఎక్కువ. వారు తమ భాషకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గతంలో హింది భాషను తమపై రుద్దవద్దంటూ పలు మార్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో కేందాన్ని చాలా సార్లు వ్యతిరేకించారు. ఇది ఇలా వుంటే పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సుల నేపథ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనలు మళ్లీ మొదలయ్యాయి.
తాజాగా, హిందీని తమపై రుద్దువద్దంటూ 85 ఏండ్ల రైతు నిరసన తెలిపాడు. రాష్ట్రంలో హిందీ మీడియాన్ని ప్రవేశపెట్టేలా కేంద్ర నిర్ణయం తీసుకోవడంపై ఆయన తీవ్ర మనస్థాపం చెందాడు. తలయ్యూర్‌లోని డీఎంకే కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు తంగవేల్ తన ఒంటికి నిప్పు పెట్టుకుని తనువు చాలించాడు.
తంగవేల్ ఆత్మహత్యకు ముందు ఓ బ్యానర్ రాశారు. మోడీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం, తమకు హిందీ వద్దన్నారు. తమ మాతృభాష తమిళమన్నారు. హిందీ అనేది జోకర్ల భాష అని ఆయన పేర్కొన్నారు. హిందీ భాషను తమపై రుద్దితే తమ విద్యార్థుల జీవితాలపై అది తీవ్రంగా ప్రభావం చూపిస్తుందన్నారు. అందువల్ల హిందీని తొలగించండన్నారు.
తమ రాష్ట్రంపై హిందీని రుద్దాలని ప్రయత్నిస్తే తమ పార్టీ ఆందోళనలకు దిగుతుందని డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇప్పటికే హెచ్చరికలు చేశారు. తమ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకుంటే తాము అలాగే చూస్తూ ఊరుకోబోమని డీఎంకే ఇప్పటికే నిరసన ప్రదర్శనలు చేసింది.