బెంగుళూరులో ఫ్యాక్షన్ బుసలు, మృతుడిది రాయలసీమ

ఫ్యాక్షన్ కక్షలంటే ముందుగా గుర్తొచ్చేది రాయలసీమ. అక్కడ పగలు, ప్రతీకారాల నేపథ్యంలో బాంబులు విసరడం, వేట కొడవళ్లతో ప్రత్యర్థులను వెంటాడి హతమార్చడం అప్పుడప్పుడు మనం వింటుంటాం. ఇప్పుడు అలాంటి సీన్ బెంగళూరులో రిపీట్ అయ్యింది. నగరం నడిబొడ్డున 45 ఏళ్ల సురేష్ అనే వ్యక్తిని సిటీ బస్సు ఎక్కాడు. బస్సు ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలోకిరాగానే అందులో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. ఆ ముగ్గురు తమవెంట తెచ్చుకున్న కత్తులు, కొడవళ్లు తీసుకొని సురేష్‌ని దారుణంగా నరికి చంపారు.

ఈ సీన్‌తో షాకైన డ్రైవర్ బండిని అక్కడే నిలిపివేయడంతో ప్రయాణికులు బస్సు దిగి పరుగులు పెట్టారు. తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన ప్రాంతానికి వచ్చిన పోలీసులు, పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.