భూములకు పట్టాలిస్తానని చెప్పి లంచం తీసుకుని మోసం చేశాడంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సూళ్లూరుపేట ఎమ్మార్వో ప్రభుత్వ భూములకు పట్టాలిస్తానని కోటీ ఇరవై రూపాయల లంచం తీసుకొని మోసం చేశాడని నాగార్జున అనే వ్యక్తి ఆరోపించాడు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. బుధవారం ఉదయం తన కారులో భార్యాపిల్లలతో సహా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన, కారులో నుంచే పెట్రోల్ పోసుకొని తానూ తగలబెట్టుకుంటానని గందరగోళం చేయడంతో భార్యా పిల్లలు బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. దీంతో అక్కడున్న పోలీసులు, అధికారులు నాగార్జునను అడ్డుకుని, ఆత్మహత్యకు పాల్పడవద్దని వారించారు. సూళ్లూరుపేట ప్రాంతంలోని ప్రభుత్వ భూములకు పట్టాలిస్తానని నమ్మబలికి, పేదల వద్ద నుంచి నగదు వసూలు చేయమని ఎమ్మార్వో చెప్పారని నాగార్జున ఆరోపిస్తున్నారు.