వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలని చాలామందికి అనిపిస్తూంటుంది. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే అనుకున్నాడు. బాగా మంచు పడుతున్న ప్రదేశానికి వెళ్లి వేడివేడి నూడుల్స్ తినాలి అనుకున్నాడు. కానీ అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. నూడుల్స్ తో పాటు అతను కూడా ఇంచుమించు గడ్డకట్టుకుపోయాడు.
కెనడాకి చెందిన జేక్ ఫిషర్ అనే వ్యక్తి అక్కడి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నూడుల్స్ తినాలనుకున్నాడు. ఇంట్లో పొగలు కక్కుతున్న నూడుల్స్ సిద్ధం చేసుకొని, స్వెట్టర్ ధరించి ఆరుబయట కాలుమోపాడు. వాటిని తినేందుకు స్పూన్ పెట్టి పైకెత్తాడు… అంతే… అది గాల్లోనే గడ్డకట్టుకుపోయింది. కనురెప్పపాటులోనే స్పూన్ తో పాటు నూడుల్స్ కూడా కదలకుండా, గాల్లో అలాగే ఉండిపోయాయి.
కేవలం నూడుల్స్ మాత్రమే కాదు.. జేక్ జుట్టు, గడ్డం కూడా గడ్డకట్టుకుపోయాయి. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ కి గురైన జేక్.. దీన్నంతా తన కెమెరాలో బంధించాడు. వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. డిసెంబర్ 28న ఈ వీడియోని అతడు పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
అంత మంచు కురుస్తుందని తెలిసి, ఎవరు నిన్ను బయటకి వెళ్లమన్నాడు.. అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు గడ్డకట్టిన ఆ వ్యక్తి ఆక్వామ్యాన్ లాగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇంకొకరైతే ఈ జేక్ నార్నియా ప్రాంతం నుంచి వచ్చాడంటూ కామెంట్ పెట్టాడు. నూడుల్స్ తినాలనుకున్న వ్యక్తే నూడుల్స్ లా మారాడంటూ మరికొందరు సరదా కామెంట్లు చేసుకుంటున్నారు.