ఇప్పుడున్న సమాజంలో పెంపుడు జంతువు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది శునకం. చాలా మంది లక్షలు పోసి కుక్కలను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా విశ్వాసమైన జంతువుగా కూడా కుక్కలకు పేరుంది. అలాంటి కుక్కలా విశ్వాసంగా బతకాలనుకున్న ఓ వ్యక్తి ఆశ్చర్యాన్ని కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నాడు.
లక్షల రూపాయలు ఖర్చు చేసి.. చివరికి కుక్క ఆకారంలోకి మారాడు. ఈ విచిత్రమైన ఘటన జపాన్ లో జరిగింది. జపాన్ కు చెందిన టోకో అనే వ్యక్తికి విచిత్ర కోరిక కలిగింది. తనకు ఎప్పటి నుంచో శునకంలా బతకాలని కల ఉండేదట. అందుకు అనుగుణంగా ఆయన పూర్తిగా శునకంలా మారాలని నిర్ణయించుకున్నాడు.
అయితే.. అనుకున్నదే తడవు స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్ షాప్ జెప్పెట్ ని సంప్రదించాడు. అల్ట్రా రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్ ను తయారు చేయమని చెప్పాడు. దాదాపు రూ.11 లక్షలు ఖర్చు చేసి.. 40 రోజుల్లో కుక్క కాస్ట్యూమ్ ను తయారు చేయించుకున్నాడు. తనకు నచ్చినట్టుగా ఉన్న కొత్త బట్టలు వేసుకున్న టోకో ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఆ దుస్తులు వేసుకున్న టోకో తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే ఫోటోలను ట్విట్టర్ అకౌంట్ లో స్నేహితులతో పంచుకున్నాడు.ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టోకో కుక్కలా బతుకుతున్నాడా..? లేదా కాస్ట్యూమ్ తీసేసి మనిషిలా మారుతాడా..? అని కామెంట్లు పెడుతున్నారు.