ఢిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్ కి 23 లక్షల బిల్లుకు కుచ్చుటోపీ పెట్టి చెక్కేసిన ఘరానా మోసగాడు అరెస్టయ్యాడు. తను అబుధాబీ రాచకుటుంబానికి చెందినవాడినని.. ప్రెసిడెంట్ షేక్ ఫలాహ్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో కలిసి పని చేశానని గొప్పలు చెప్పుకుని ఈ వ్యక్తి హోటల్ లో దిగాడు. అధికారిక పనులపై ఇండియాకు వచ్చానని స్టయిల్ గా హోటల్ సిబ్బందిని నమ్మించాడీ ఫ్రాడ్ స్టర్. ఆగస్టు 1 న లీలా ప్యాలెస్ లోని 427 వ గదిలో దిగిన ఈ ఘరానా మోసగాడు 23 లక్షల బిల్లు ఎగ్గొట్టి గప్ చుప్ గా మాయమయ్యాడు.
ఇతగాడు పరారైన విషయాన్ని గమనించిన సిబ్బంది.. ఇతని రూమ్ లో వెదకగా .. అందులోని వెండి పాత్రలు, ముత్యాలతో కూర్చిన ట్రేతో సహా మరికొన్ని విలువైన వస్తువులు దొంగిలించుకుపోయాడని గుర్తించారు. 4 నెలల పాటు హోటల్ గదిలో బస చేసినందుకు, అద్దె, మిగతా సేవలకు మొత్తం 35 లక్షల బిల్లు కాగా ఇతడు రూ. 11.5 లక్షలు మాత్రం చెల్లించి పారిపోయాడు.
మొత్తానికి 41 ఏళ్ళ మహ్మద్ షరీఫ్ అనే ఈ చీటర్ ని ఢిల్లీ పోలీసులు ఈ నెల 19 న కర్ణాటక లోని దక్షిణ కన్నడలో అరెస్టు చేశారు. తన ఫేక్ బిజినెస్ కార్డుతో, నకిలీ యూఏఈ రెసిడెంట్ కార్డు, ఇతర డాక్యుమెంట్లతో షరీఫ్ .. హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించాడని కూడా తేలింది.
ఈ హోటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 14 న కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. షరీఫ్ ని వారు కోర్టులో ప్రవేశపెట్టారు. హోటల్ మేనేజర్ కిఇతడిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని తెలిసింది.