అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. ఓఆటో డ్రైవర్ నైతే లాటరీ రూపంలో వరించింది. ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. కేరళలోని శ్రీవరాహంకు చెందిన అనూప్ కి పాతిక కోట్ల ప్రైజ్ మనీ రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
ఓనం బంపర్ లాటరీ 2022లో రూ . 25 కోట్ల జాక్‌పాట్ కొట్టిన అనూప్ గత వారం తొడుపజలోని మనక్కడ్ జంక్షన్ వద్ద లాటరీ స్టోర్‌ను ప్రారంభించాడు. లాటరీ తన జీవితంలో ఎన్నడూ చూడని సంపదను తీసుకువచ్చిందని, అందుకే తాను లాటరీ టికెట్లను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకున్నానని అనూప్ చెప్పాడు.
తన భార్య మాయ, తన పేరులోని మొదటి అక్షరాలతో అనూప్ తన లాటరీ స్టోర్‌కు ఎంఏ లక్కీ సెంటర్ అని పేరు ఎంచుకున్నాడు. బంపర్ లాటరీని గెలుచుకునే ముందు అనూప్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. లాటరీ తగిలిన తర్వాత కూడా కొద్దిరోజులు ఆటో నడిపిన అనూప్ ఆపై ఆటోను తన సోదరుడికి అప్పగించాడు. పన్నులు వగైరా పోగా అనూప్‌కు రూ . 12 కోట్లు బంపర్ ప్రైజ్ కింద దక్కాయి.
అనూప్ నెంబర్‌కు రూ. 25 కోట్ల బంపర్ ప్రైజ్ తగిలిందని ఓనం బంపర్ 2022 నిర్వాహకులు గత ఏడాది సెప్టెంబర్ 18న ప్రకటించారు. కేరళ బంపర్ లాటరీని గెలుచుకోకముందు అనూప్ చెఫ్‌గా పనిచేసేందుకు మలేషియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
లాటరీలో విజేతగా నిలిచేందుకు ఒక రోజు ముందు అనూప్‌కు రూ . 3 లక్షల రుణాన్ని మంజూరు చేసేందుకు ఓ బ్యాంక్ అంగీకరించింది. జాక్‌పాట్ ప్రైజ్ గెలుచుకున్న తర్వాత తనకు రుణం అవసరం లేదని బ్యాంకుకు చెప్పడంతో పాటు తన మలేషియా ట్రిప్‌నూ రద్దు చేసుకున్నాడు.