సినిమాలు చూసి ప్రజలు నేర్చుకుంటున్నారో… ప్రజలను చూసి సినిమాలు చూస్తున్నారో తెలియదు కానీ… నిజ జీవితంలో కూడా సినిమా సన్నివేశాలు ఎన్నో జరుగుతున్నాయి. ఓ తెలుగు సినిమాలో హీరో ఇద్దరు యువకులను పోలీసు అని చెప్పి బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకునే సన్నివేశం మనలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది కదా..!
అచ్చం అలాంటి సీనే ఒకటి గురుగ్రామ్ లో జరిగింది. ఒక స్నేహితుడు, స్నేహితురాలు కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా వారి వద్దకు పోలీసు దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిద్దరిని బెదిరించి సుమారు 1.40 లక్షల రూపాయలు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … శుభమ్ తనేజా అనే వ్యక్తి ఆయన సంస్థలోనే పని చేసే ఆయన స్నేహితురాలితో కలిసి కింగ్‌డమ్ ఆఫ్ హెవెన్ సమీపంలో కారులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలో వారి వద్దకు పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తులు వచ్చి వారి గురించి వివరాలు తెలుసుకొని, ముందుగా వారి ఫోన్లు, గుర్తింపు కార్డులను తీసుకున్నారు. తరువాత ఎటువంటి గొడవ జరగకుండ ఉండాలంటే మీరిద్దరు 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దాంతో వారు ఏటీఎం నుంచి లక్ష రూపాయలు తీసుకున్నారు. వాటితో పాటు వారి వద్ద ఉన్న మరో 40 వేల రూపాయలు కలిపి వారికి ఇచ్చారు.
దీంతో వారు ఫోన్లు, గుర్తింపు కార్డులు ఇచ్చేసి పారిపోయినట్లు తనేజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు వారి ఇంటికి వెళ్లిపోయి తరువాతి రోజు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఈ ఘటన పై సెక్టార్ 29 పోలీసు స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 384 కింద నకిలీ పోలీసు పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు ఇన్వెస్టిగేటింగ్ అధికారి సబ్ ఇన్‌స్పెక్టర్ సజ్జన్ సింగ్ తెలిపారు.