తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పూర్తైన పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆ పాఠశాలలకు నూతన రంగులు వేసి, అందంగా తీర్చిదిద్ది ప్రారంభానికి సిద్ధం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపెస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధునికీకరించిన 684 బడులు బుధవారం ప్రారంభమయ్యాయి.
పనులు పూర్తైన పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, హ్యాండ్ వాష్, సంప్, టైల్స్, డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డులు, డిజిటల్ పరికరాలు, కంపౌండ్ వాల్, డైనింగ్ హాల్ , కిచెన్ షెడ్ వంటి మొత్తం 12 రకాల అభివృధ్ది పనులు చేశారు.
అనంతరం విద్యాశాఖ మంత్రి సబిత మాట్లాడుతూ.. మొదటి విడతలో ఇప్పటివరకు సుమారు 12 వందల పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. మూడేళ్లలో మూడు దశల్లో రాష్ట్రంలోని 26,055 పాఠశాలల రూపురేఖలు మార్చనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో రూ.9,123 కోట్లతో 3,497 బడులను ఆధునికీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు 12 రకాల సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
మన ఊరు – మన బడి పథకం క్రింద పాఠశాలల్లో పరిశుభ్రమైన త్రాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజన వసతి ఏర్పాట్లు, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పనులు సత్వరం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.