సినిమా ఇండస్ట్రీలో అనేక మోసాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అంటూ డబ్బులు దోచేసే బ్యాచ్ చాలామందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ అనుష్క పేరు చెప్పి ఓ వ్యక్తి 51 లక్షలు పిండుకున్నాడు. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో ఈ విషయం బయటకొచ్చింది.
లక్ష్మణా చారి అనే నిర్మాతకు విశ్వకర్మ క్రియేషన్స్ అనే సంస్థ ఉంది. అయితే.. ఎల్లారెడ్డి అనే మేనేజర్ అనుష్క, మణిశర్మ అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని మోసం చేశాడని అంటున్నారు. మాయమాటలు చెప్పి.. తన నుంచి రూ.51 లక్షల వరకు తీసుకున్నాడని వాపోతున్నాడు. ఈ మేరకు బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు లక్ష్మాణా చారి.
తనను ఎల్లారెడ్డి పలుమార్లు బెంగళూరు తీసుకెళ్లాడని తెలిపారు. మోతి మహల్ హోటల్ లో పలువురిని పరిచయం చేశాడని.. కానీ, అనుష్క అపాయింట్ మెంట్ మాత్రం దొరకడం లేదని.. చివరకు ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించినట్లు తెలిపారు.
లక్ష్మణా చారి నిర్మాతల మండలిలో కూడా ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిని ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దొరై హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు లక్ష్మణా చారి.