– రోజురోజుకీ టీఆర్ఎస్ లో పెరుగుతున్న ఆధిపత్య పోరు
– తాజాగా మానకొండూర్ లో బయటపడ్డ విభేదాలు
టీఆర్ఎస్ లో రోజుకో పంచాయితీ తెరపైకొస్తోంది. తాజాగా మానకొండూర్ టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ పై కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ కృష్ణారావుకు ఫిర్యాదు చేసింది రసమయి వర్గం. సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతూ.. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్, బీజేపీలతో ఓరుగంటి అంటకాగుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఓరుగంటి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అంటోంది రసమయి వర్గం. ఈ నేపథ్యంలోనే ఆరు మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో రాబోయో ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. బాలకిషన్ పై, కేసీఆర్ పై అసత్య ఆరోపణలతో కూడిన వ్యతిరేక పోస్టులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఓరుగంటి ఆనంద్ పై వెంటనే పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఒక శాఖకు మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తి అన్ని పార్టీల వ్యక్తులను సమానంగా చూస్తారని అంటోంది ఓరుగంటి వర్గం. కావాలనే బురద జల్లుతున్నారని రివర్స్ ఎటాక్ చేస్తోంది.
మొత్తానికి ఈ వర్గంపోరుతో టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరును గుర్తు చేసింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఎన్నికల నాటికి గొడవలు పెద్దవి అవుతాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.