కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్లకే ఉన్నత పదవులు కట్టపెడుతూ..తెలంగాణ బిడ్డలకి పంగనామాలు పెడుతున్నారని జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ వ్యాఖ్యానించారు. పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవిలో గతంలో కర్ణాటకకు చెందిన వ్యక్తులను కూర్చోబెట్టారు. ఆ దుర్మార్గాన్ని మరవకముందే మళ్ళీ ఇప్పుడు ఆంధ్రవాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు ఇచ్చారని మండిపడ్డారు.
సోమవారం ఉదయం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం వీసీ రవీందర్ రెడ్డి చాంబర్ ముందు నిరసన తెలిపారు. ఉద్యోగ నియామాకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లలో రోస్టర్ పద్ధతిని పాటించకుండా ఇచ్చిన నియామక ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్లకి కట్డబెట్డడం అనైతికం అని అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రోళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మానవతారాయ్.