మందు బాబులకు మంచిర్యాల కోర్టు ఝలక్ ఇచ్చింది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు, వాహనాలు సీజ్ చేయడం, సంబంధిత వ్యక్తులకు కౌన్సిలింగులివ్వడంతో సరిపెట్టిన కోర్టు,ఇప్పడు సరికొత్త శిక్షకు శ్రీకారం చుట్టింది. తప్పతాగి వాహనం నడుపుతున్న 13 మంది నిందుతులకు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రం చేయాలని మంచిర్యాల జిల్లా మొదటి తరగతి న్యాయమూర్తి ఆదేశించారు.
నిబంధనలను ఉల్లఘించి పలు మార్లు పట్టుబడినా వారిలో మార్పు రాకపోవటంతో ఈ శిక్ష విధించారు. రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరోగ్య కేంద్రంలో శుభ్రత పనులు చేయాలని లేదంటే పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించాలని తెలిపారు. న్యాయమూర్తి ఉపనిషత్ వాణి తీర్పుతోనైనా మందు బాబులకు మార్పు రావాలని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఇటీవల జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తనిఖీల్లో దొరికకుండా ఉండేందుకు పలువురు అడ్డదారుల్లో వెళ్తున్నట్లు గుర్తించిన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా వారిలో మార్పు రావడం లేదని చెబుతున్నారు.
కుటుంబసభ్యుల సమక్షంలో వారికి మందు తాగి నడపటం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించినా..పలువురు అప్పుడు తప్పు తెలుసుకున్నట్లు నటిస్తున్నారని.. తరువాత వారి ప్రవర్తన షరామామూలే. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించే అంశాన్ని ఉన్నతాధికారులు కూడా పరిశీలిస్తున్నారు.
“ మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా చాలా మందికి మార్పు రావడం లేదు. ఈ తీర్పుతోనైనా వారు మారుతారని భావిస్తున్నాం” అని పోలీసు అధికారులు అంటున్నారు.