నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాళేశ్వరం ప్యాకేజ్ 21, 22 మంచిప్ప ముంపు ప్రాంత ప్రజలు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. వివరాల్లోకెళితే..జిల్లాలోని మోపాల్ మండలం మంచిప్ప ముంపు ప్రాంత ప్రజలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు.
మంచిప్ప జలాశయం ముంపుపై తమతో కలెక్టర్ చర్చించాలని డిమాండ్ చేశారు. మంచిప్ప, బైరాపూర్, అమ్రాద్ గ్రామాలు, పది తండాల ప్రజలు భారీగా తరలి వచ్చి కలెక్టర్ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
కొంత మంది ప్రజా ప్రతినిధులు వస్తే చర్చిస్తామని అధికారులు చెప్పారు. కానీ, అందుకు జనం ఒప్పుకోలేదు. ఎర్రటి ఎండలో రెండు గంటల పాటు బాధితులు ఆందోళన చేశారు. చివరకు కలకెక్టరేట్ సమీపంలోని కూడలిలో బైఠాయించారు.
ముంపుపై తమతో కలెక్టర్ చర్చించాలనే డిమాండ్ తో మంచిప్ప ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన చేశారు. రెండు గంటల ఆందోళన అనంతరం చివరకు ప్రజలు గేట్ వద్ద అధికారులకు వినతి పత్రం సమర్పించారు. తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.