తీగ లాగితే డొంకంతా కదలడమంటే ఇదే. నార్సింగి మంచిరేవుల ఫాంహౌస్ పేకాట కేసుతో గుత్తా సుమన్ క్రైమ్ హిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇతగాడి చరిత్ర అంతా తిరగేసిన పోలీసులు కొత్తకొత్త విషయాలు తెలిశాయి. ఫాంహౌస్ ను పేకాట అడ్డాగా మార్చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. బడాబాబులతో తరచూ పేకాట ఈవెంట్స్.. దానికోసం స్పెషల్ ఇన్విటేషన్స్.. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు.. మద్యం, అమ్మాయిలు.. అబ్బో… సుమన్ సిత్రాలు అన్నీ ఇన్నీకావు.
సుమన్ పేకాట డెన్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే రూ.25 వేల రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటేనే అర్థం చేసుకోండి. మనోడి రేంజ్ ఏంటో. క్రైమ్ చేయడంలో తనకున్న కెపాసిటీ ఏంటో. సుమన్ తరచూ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు అద్దెకు తీసుకోవడం.. వాటిలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిజానికి మంచిరేవుల ఫాంహౌస్ లో మొదట్లోనే దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు. లేకపోతే ఇంకా ఎన్నో సీన్స్ కనిపించేవి. ప్రస్తుతానికి అరెస్ట్ అయిన 30 మందిలో 29 మందికి బెయిల్ మంజూరు చేసింది ఉప్పర్ పల్లికోర్టు.
గుత్తా సుమన్ ను చర్లపల్లి జైలు నుండి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. రెండురోజులపాటు అతడి విచారణ ఉంటుంది. గుత్తా సుమన్ పై ఏపీలో ఉన్న కేసులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. బ్లాక్ మెయిల్, ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించారు.