టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఓ ఇంటివాడయ్యాడు. భూమా మౌనికారెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి జరిగింది. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు అలానే సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీస్ హాజరయ్యారు. మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.
అంతేకాదు ఈ పెళ్లికి వైఎస్ విజయమ్మ, మౌనికరెడ్డి సోదరి అఖిలప్రియతో పాటు శాంతబయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి పెళ్లి వేడుకలో కనిపించారు. మనోజ్, మౌనిక పెళ్లి ఫొటోలు అలానే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగర్ సునీత ఆమె భర్తతో కలిసి రాగా, సిద్దు జొన్నలగడ్డ, తేజ సత్య, డైలాగ్ రైటర్ బివిఎస్ రవి, దర్శకుడు బాబి, వెన్నెల కిషోర్, ఇంకా అనేకమంది సెలబ్రెటీస్ సందడి చేశారు.
పెళ్లి బట్టల్లో మనోజ్, మౌనిక జంట మెరిసిపోయింది. బంగారు వర్ణం పట్టు కుర్తా, దోతిలో మనోజ్ కనిపించగా.. ఆకుపచ్చ, గులాబీ వర్ణం పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా ఉంది. గత ఏడాది హైదరాబాద్‌లో వినాయకచవితి ఉత్సవాల్లో మౌనికరెడ్డితో కలిసి పాల్గొన్నాడు మనోజ్.
అప్పటినుంచే వీరి పెళ్లి వార్తలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల అనుమతితో శుక్రవారం ఈ జంట పెళ్లిపీటలెక్కారు. కాగా మనోజ్‌తో పాటు మౌనికకు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లాడాడు మనోజ్. మనస్పర్థలతో 2019లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.