టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ‘మా’ బిల్డింగ్ ఇష్యూ మీద నోరు విప్పారు. మరో ఆరో నెలల్లో శాశ్వత మా భవనానికి భూమి పూజ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
‘మా’ సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గన్న విష్ణు మాట్లాడుతూ.. మా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆయన సేవలను కొనియాడారు.
అలాగే, ఆరు నెలల్లోనే మా శాశ్వత భవనానికి భూమి పూజ చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ‘మా ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగానే అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాం. మరో ఆరు నెలల్లో భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాం. ‘మా’ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే నా ప్రధాన కర్తవ్యం. అందుకోసం నా కమిటీతో కలిసి తగిన ప్రణాళికలు రచించాం.’ అని విష్ణు చెప్పుకొచ్చారు.
ఇక టికెట్ రేట్ల అంశం మీద కూడా విష్ణు స్పందించారు. టికెట్ రేట్లు పెంచితే కొందరికి లాభమని, ఇంకొందరికి నష్టమని, అందుకే నాడు ఆ విషయం మీద మౌనంగా ఉన్నానని మంచు విష్ణు తెలిపారు. టికెట్ రేట్లు అనేది చాలా పెద్ద అంశమని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి ఈ విషయం మీద అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు.
ఇక మంచు విష్ణు ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లతో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఈ మధ్య నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.