ఊహించని విధంగా చిరంజీవిపై కామెంట్స్ చేశాడు హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. జగన్ ను వెళ్లి కలవడం చిరంజీవి వ్యక్తిగతం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకరిద్దరు విడివిడిగా కలిసి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నాడు. అందరం ఏకతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించుకుందామంటూ చిరంజీవి రాయబారాన్ని సైడ్ లైన్ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు.
చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య చిన్నచిన్న అభిప్రాయబేధాలున్నాయనే విషయం బహిరంగ రహస్యం. పైగా మొన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మొత్తం మంచు విష్ణు ప్యానెల్ కు వ్యతిరేకంగా పనిచేసిందనేది కూడా అంతే బహిరంగ రహస్యం. ఇలా రాజుకున్న నిప్పు ఇంకా రగులుతూనే ఉందనే విషయం ఇప్పుడు మంచు విష్ణు వ్యాఖ్యలతో మరోసారి బయటపడింది.
మంచు విష్ణు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. సినీ కళామతల్లి బిడ్డగా, సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్ ను కలిశానంటూ చిరంజీవి పబ్లిక్ గా ప్రకటించిన విషయం మంచు విష్ణుకు తెలియదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి, మీకు-మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోమని, ఇండస్ట్రీని అన్యాయం చేయొద్దంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇప్పుడీ మొత్తం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చిరంజీవి మరో 3 రోజుల్లో మరోసారి జగన్ ను కలవబోతున్నారు. ఈసారి ఒక్కరే వెళ్లడం లేదు. కొంతమంది సినీ ప్రముఖుల్ని వెంటేసుకొని మరీ వెళ్తున్నారు. మరోవైపు టికెట్ రేట్ల అంశంపై ఏర్పాటుచేసిన కమిటీ, ఫిలింఛాంబర్ సభ్యులతో మీటింగ్స్ పూర్తిచేసింది. తమ పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వబోతోంది. ఈనెల 10వ తేదీకి ఈ వ్యవహారాలన్నీ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి.
ఈసారి చిరంజీవి, ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ అందించేలా ఉన్నారు. మరి త్వరలోనే చిరంజీవి, జగన్ ను కలవబోతున్న మీటింగ్ కూడా ఆయన వ్యక్తిగతమేనా అంటూ సోషల్ మీడియాలో మంచు విష్ణుపై ట్రోలింగ్ నడుస్తోంది.