రాజ్యాంగంపై కేసీఆర్ మాటలు అర్ధ రహితమన్నారు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదగ. ఇన్నేళ్ల పాలనతో కేసీఆర్ కి అంబెద్కర్ అంటే గిట్టదని తమకు అర్ధమైందని చెప్పారు. రాజ్యాంగంలో పొందు పరిచిన చట్టాలు కేసీఆర్ కి నచ్చవన్నారు. సీఎంది మనసులో ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడే నైజం అని విమర్శించారు. ఉద్యమ సమయంలో దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినా.. కేసీఆర్ మనసులో మాత్రం తానే ముఖ్యమంత్రి కావాలని ఉండేదన్నారు మందకృష్ణ. అంబేద్కర్ అంటే ఎందుకంత విద్వేషమో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చూసి సీఎం భయపడిపోతున్నారని చెప్పారు. అసలు.. ఆయన ముఖ్యమంత్రి అయింది అంబేద్కర్ రాజ్యాంగం వల్లేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
తెలంగాణ వచ్చాక అమర వీరుల స్తూపం దగ్గరకు వెళ్లిన కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహాన్ని పూల దండ వేయలని గుర్తు చేశారు మందకృష్ణ. అప్పుడే ఆయన తీరు అర్ధం అయిందని చెప్పారు. కేసీఆర్ ఉంటున్న ఇల్లు గాంధీ ఘాట్ కి చాలా దూరం.. అంబేద్కర్ విగ్రహానికి చాలా దగ్గర.. కానీ ఏనాడూ దండ కూడా వేయలేదని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు రారని.. ఎర్రవెల్లి ఇంటి దగ్గరలో ఉన్న విగ్రహాన్ని సైతం కనీసం చూడరని ఆరోపించారు. దళితులని నమ్మించి 125 అడుగుల విగ్రహాన్ని పెడతానని మాట ఇచ్చారన్నారు మందకృష్ణ. కానీ.. దానికంటే ముందే కోట్లు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ నిర్మించుకున్నారని గుర్తు చేశారు. వందల కోట్లతో ఫాంహౌస్, ప్రగతి భవన్ కట్టుకున్నారని విమర్శించారు. అంబేద్కర్ అంటే కేసీఆర్ కి ఎందుకు గౌరవం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ శాసన సభలోనే తన అహంకారాన్ని చూపించారని.. పదే పదే దొరను అని చెప్పుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ గడ్డ మీద గ్రామగ్రామాన అంబేద్కర్ స్ఫూర్తి ఉందని చెప్పారు మందకృష్ణ. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లే నేడు దళితులు ధైర్యంగా బతుకుతున్నారని.. దానిని చూసి దొరలు ఓర్వేలకపోతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో పొందు పరిచిన మొదటి పేజీ చూస్తేనే కేసీఆర్ కి నిద్ర పట్టడం లేదన్న ఆయన.. దాన్ని కనుమరుగు చేస్తే తప్ప భవిష్యత్ ఉండదని భావించి ఈ కుట్రకు తెరతీశారని ఆరోపించారు. తప్పును ఎత్తిచూపితే కేసీఆర్ కు నచ్చడం లేదని.. అందుకే రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ను జైల్లో పెట్టించారన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైలులో పెడుతున్నారని.. అయినా ఎన్ని రోజులు పెడతారని హెచ్చరించారు. రాజ్యాంగంలో ఉన్న కొన్ని ముఖ్యమైన చట్టాల వల్ల బెయిల్ వస్తోందని తెలిపారు. అందుకే పౌర హక్కులు లేకుండా రాజ్యాంగాన్ని రాయాలని కేసీఆర్ అనుకుంటున్నారా? అని నిలదీశారు.
ఉత్తరాది ఆధిపత్యం దక్షిణాది రాష్ట్రాలపై ఉందన్న మందకృష్ణ.. అయినా కేసీఆర్ కేంద్రం దగ్గర వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన ప్రతీ బిల్లుకు కేసీఆర్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఇక్కడే అర్ధం అవుతుంది.. కేసీఆర్ కి కేంద్రంతో వైరుధ్యం ఏమీలేదని.. రైతు వ్యతిరేక చట్టాలు దేశంలో చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినా.. కేసీఆర్ సమర్థించడం వెనుక ఉన్న మర్మం ఏంటో అందరికీ తెలుసుని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ ప్రధాన మంత్రిని కలిసి వంగి వంగి దండలు పెట్టలేదని… కేసీఆర్ మాత్రం సామంతరాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ దొందూదొందేనని ఆరోపించారు మందకృష్ణ మాదిగ.