ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై రాజధాని సమీప గ్రామాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మందడంలో ఉదయం నుంచే బంద్ వాతావరణం నెలకొంది. శుక్రవారం నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రైతులు రోడ్లపైకి వచ్చారు. దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి సహాయం చేయరాదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. తమ దుకాణాల ముందు సైతం పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. తమ గ్రామం మీదుగా పోలీస్ వాహనాలు వెళ్లడానికి వీల్లేదని రైతులు అడ్డుకొని వెనక్కి పంపేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. రోడ్డంతా పరదాలు పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింప చేశారు.