మ్యాన్ విత్ మంథని-పెద్దపల్లి రోడ్ ! యస్, ఈమద్య కాలంలో మంథని ప్రాంతంలో మొదలైన కొత్తరకం ఆట ఇది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘మ్యాన్ విత్ వైల్డ్’ను ఆదర్శంగా తీసుకుని, పాలకులు మా మంథని మీద ప్రేమతో మాకు అందించిన అద్భుతమైన ఆట ఇది. అమెజాన్ అడవిలో, సహారా ఎడారిలో, చంబల్ లోయలో ఒంటరిగా ప్రయాణించినా కలగని టెర్రర్, ఒళ్ళు గగుర్పాటు పొడిచే థ్రిల్ కలగలిసి మాటల్లో చెప్పలేని సాహసోపేత ప్రయాణమది. టైటానిక్ సినిమాలాగా అచ్చంగా గంటన్నర పాటు కొనసాగే హర్రర్, థ్రిల్లింగ్ రియల్ ఫాంటసీ మా మంథని-పెద్దపల్లి రోడ్డు ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడ, ఏ రకమైన గుంత ఎదురవుతుందో తెలియదు. సాహోను మరపించే సస్పెన్స్ థ్రిల్లర్ జర్నీ మా మంథని-పెద్దపల్లి రోడ్డు ప్రయాణం.
(హరీశ్, మంధని నివాసి)
తప్పనిసరై ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి ఈ ఆటలో పాల్గొనాల్సి వచ్చింది. మ్యాన్ విత్ వైల్డ్‌లో నరేంద్ర మోడీలాగ నా ‘మ్యాన్ విత్ పెద్దపల్లి-మంథని రోడ్’ జర్నీ సహజంగానే చాలా ఉద్వేగభరితంగా సాగింది. పొద్దున్నెప్పుడో బయలుదేరా. భయం భయంగానే తిరుగు ప్రయాణం మొదలు పెట్టా. తీరా పెద్దపల్లి వచ్చేసరికి చీకటి పడింది. పైగా జోరు వాన. ఇక ఇసుక లారీలు సరే సరి. గుండారం నుంచి ఎదురయ్యే గండాలను దాటుతూ, ఇంకుడు గుంతలకు ఏ మాత్రం తగ్గని గుంటలను చాకచక్యంగా తప్పించుకుంటూ,
కాంటూరు కందకాలను తలపించే బురద కాలువలను దాటుకుంటూ, ఆదివారం పేట దగ్గర ఎదురయ్యే కల్వకుంట్ల చెరువును ఈదుకుంటూ, శ్రీరాంనగర్ దగ్గర రోడ్డుకు అడ్డంగా చెక్ డ్యాంను తలపించే పిల్ల గుట్టను ఎక్కిస్తూ, కుచిరాజ్‌పల్లి దగ్గర ఎదురయ్యే చంబల్ లోయలో పాములా కదులుతూ.. మొత్తం మీద చంద్రయాన్ – 2 లాగా మంథని మొదలు పెద్దపల్లి చేరే వరకు క్షణమొక యుగంలా, ఉద్వేగంగా కొనసాగే ప్రయాణమది. తేడా ఒక్కటే అక్కడ ఒక్కడే శివన్ ఇక్కడ నా లాంటి ఎందరో శివన్‌లు.
కారు చీకట్లో, హోరు వానలో, నీటి వరద, కాఫీలాంటి బురద, ఇసుక లారీల దడదడ, వెనుకనుంచి ఆర్టీసీ బస్సుల రొద.. ఎంత చెప్పినా తక్కువే! మొత్తం మీద ఆద్యంతం సాహసభరితంగా సాగింది నా ‘మ్యాన్ విత్ మంథని-పెద్దపల్లి రోడ్’ ప్రయాణం.
గ్రీన్ చాలెంజ్‌లు కాదు గానీ ఈ రోడ్డు మీద ఎవరైనా ‘రైడ్ ఛాలెంజ్’ విసిరితే బాగుండనని అనిపించింది. అప్పుడు కానీ, మా మంథని ప్రజల నైపుణ్యం ఏంటో ప్రపంచానికి తెలిసేది.
‘అయ్యా ‘ఎస్’ లూ! మీరంతా కొండల మీద ట్రెక్కింగులు చేయడం కాదు, మంథని-పెద్దపల్లి రోడ్డు మీద గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఆగకుండా, అది కూడా ఆయాస పడకుండా, అమ్మనా బూతులు తిట్టుకోకుండా ఒక్కసారి నడిపి చూడండి. ఒలంపిక్స్‌లో కప్పు గెలిచినంత సంబర పడిపోతారు.
చివరగా: ఇంత అద్భుతమైన ఆటను మాకు అందించిన పేదల పక్షపాతి, బంగారు తెలంగాణాకు అంకురార్పణ చేసిన అపర భగీరథుడు కేసీఆర్ గారిని ఒక్కసారి సవారి గిత్తలు కట్టిన ఎడ్లబండిలో పెద్దపల్లి నుంచి మంథని వరకు ఊరేగింపుగా తీసుకు రావాలని మా మనసు పరిపరి విధముల ఉవ్విళ్లూరుతున్నది. గిత్తలు ఎగిరి ఎగిరి పరుగులు తీస్తుంటే దొర ఎంత సంబరపడిపోతాడో.. బంగారు తెలంగాణ దర్శనమయ్యిందని ఎంతగా మురిసిపోతాడో.. సెక్యూరిటీ ప్రాబ్లమ్ అనుకుంటే కనీసం ట్రాక్టర్ ట్రాలీలోనైనా వారిని ఊరేగించాలని మా మంథని ప్రజల వాంఛ.
దొరా.. అంగీకరించవా.. ప్లీజ్ !