గుంటూరు: అమ్మా అనే కమ్మని పిలుపు కోసమే ఆమె తాపత్రయం. పెళ్లయిన 57 ఏళ్లకు.. అది కూడా 74 సంవత్సరాల వయసులో గర్భం దాల్చిందామె. సిజేరియన్ ద్వారా కవలలను ప్రసవించేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరలేదు. అలా ఏళ్లు గడిచాయి. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. ఇంత వయసులోనూ తల్లి కావాలనే బలీయమైన కోరిక మంగాయమ్మను వెంటాడింది.
తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడు వీరి స్వగ్రామం. సంతాన సాఫల్య చికిత్స గురించి విన్న మంగాయమ్మకు ఆశ కలిగింది. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌కు చెందిన ఐవీఎఫ్ నిపుణులైన డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్‌ను కలిసి మాట్లాడారు. మంగాయమ్మ పూర్తి ఆరోగ్యంతో వున్నారు. ఆమెకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. దాంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. ఇదంతా గత ఏడాది నవంబరు మాసంలో జరిగింది.
మెనోపాజ్ దశ దాటిపోయిన మంగాయమ్మకు వేరే మహిళ నుంచి అండాన్ని, రాజారావు వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యులు సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం దాల్చారు. వయసును దృష్టిలో ఉంచుకొని అప్పటి నుంచి ఆమెను అహల్య నర్సింగ్‌హోమ్‌లోనే వుంచి వైద్యుల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, గైనకాలజిస్టు, న్యూట్రిషనిస్ట్.. ఇలా అందరూ వచ్చి రోజూ మంగాయమ్మ ఆరోగ్యాన్నిపర్యవేక్షించారు. వయసు కారణంగా సాధారణ ప్రసవం కష్టం కనుక సిజేరియన్ ద్వారా కాన్పు చేయడానికి డాక్టర్లు నిర్ణయించారు. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్టు తేలింది. శస్త్రచికిత్స కోసం ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు శిశు వైద్యనిపుణులు, ఇద్దరు మత్తు మందు డాక్టర్లను, కార్డియాలజిస్ట్‌లను సిద్ధం చేసి నెలలు నిండటంతో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్. మంగాయమ్మ పండంటి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమం!
గతంలో 72 ఏళ్ల మహిళ తల్లి కావడమే ఇంతవరకు వున్నవరల్డ్ రికార్డు. రాజస్థాన్‌కు చెందిన దల్జీందర్ సాధించిన ఈ రికార్డును 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ ఇప్పుడు చెరిపేశారు. పండంటి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డుని తిరగరాశారు. ఇప్పుడామె పట్టరాని సంతోషంతో… పట్టపగ్గాల్లేని ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు.