తెలంగాణ ఇస్తే.. ఏపీలో కనుమరుగవ్వడం ఖాయమని సోనియాగాంధీకి ఆనాడు తెలుసు. అయినా.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయక తప్పలేదు. ఏపీలో తెరమరుగైనా తర్వాత పుంజుకుందాం.. తెలంగాణలో గెలుద్దామని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ.. జరిగింది వేరు. ప్రజలు టీఆర్ఎస్ కు జై కొట్టారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. గజ్వేల్ సభే అందుకు నిదర్శనం. పార్టీలోని చోటా లీడర్ల నుంచి పైస్థాయి నేతల దాకా ఉత్సాహంలో ఉన్నారు. ఇదే ఊపులో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి.. సోనియాగాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. టీపీసీసీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కూడా ఇదే పిలుపునిచ్చారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి హాజరైన మాణిక్కం ఠాగూర్… తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల ఆలోచన కూడా అదేనని చెప్పుకొచ్చారు. రోజురోజుకీ కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వణుకు మొదలైందని సెటైర్లు వేశారు.
బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్.. హామీల విషయంలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు ఠాగూర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. దీనికోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడే వారికి భవిష్యత్ ఉంటుందని హామీఇచ్చారు మాణిక్కం ఠాగూర్.