తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ఆపార్టీ నేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో 14 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు ఠాగూర్. ఈ యాత్రలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం పూట రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతారని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే ఈ యాత్ర చేపట్టారని, జనం నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మోడీ ప్రభుత్వ కార్పొరేటీకరణ, నిరుద్యోగ సమస్యే ఎజెండాగా రాహుల్ యాత్ర సాగుతోందని వివరించారు.
రాహుల్ గాంధీ ప్రజా ప్రయోజనాలే తప్ప.. పార్టీ ప్రయోజనం కోసం యాత్ర చేయడం లేదన్నారు ఠాగూర్. ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఇక గురువారం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకూ రూట్ మ్యాప్ ను పరిశీలించనున్నారు ఠాగూర్. అలాగే హైదరాబాద్ కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. పార్టీ ముఖ్యనాయకులతో వీరిద్దరూ సమావేశం కానున్నారు.
సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఇప్పటివరకు 905 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. త్వరలోనే తెలంగాణలో ఎంటర్ కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ పాదయాత్ర జమ్మూకశ్మీర్ లో ముగుస్తుంది.