ఇంద్రవెల్లి సభ సక్సెస్.. రావిర్యాల సభ సూపర్.. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. ఉదయం నుంచి నాయకులతో సమావేశం అవుతున్నారు. ఇవాళంతా ఆయనకు బిజీ షెడ్యూలే. గాంధీ భవన్ పరిసరాలన్నీ కాంగ్రెస్ నేతలతో సందడిగా మారాయి.
అధిష్టానం ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించారు ఠాగూర్. పార్టీ చేపట్టిన దళిత, గిరిజన దండోరాపై అసెంబ్లీ కోఆర్డినేటర్లతో చర్చలు జరుపున్నారు. ఇప్పటికే నిర్వహించిన రెండు సభలు సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. భవిష్యత్ సభలు కూడా పక్కాగా నిర్వహించి విజయవంతం చేయాలని చూస్తున్నారాయన. కాసేపట్లో టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం ఉంది. అలాగే రాత్రి 7గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ ఉంటుంది. దళిత, గిరిజన దండోరా సభల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపైనే ప్రధానంగా ఈ భేటీల్లో చర్చ జరగనుంది.
మరోవైపు హుజూరాబాద్ అభ్యర్థి విషయంలోనూ కాంగ్రెస్ ఓ క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొండా సురేఖను పోటీకి దింపాలని నేతలు భావిస్తున్నా… పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మాత్రం స్థానిక నేతను ఎంపిక చేయాలని చూస్తున్నారు. దీనిపై అధిష్టానానికి పలు సూచనలు కూడా పంపారు. ఇవాళ రాత్రికి అభ్యర్థి విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.