హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రతి ఇంటికీ వెళ్లాలన్నదే రాహుల్ గాంధీ ఉద్దేశమని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, అభివృద్ధి, సంక్షేమాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర గ్రామగ్రామాన విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని, ప్రభుత్వాల వైఫల్యాలను జనాల్లోకి తీసుకు వెళ్తున్నామన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని చెప్పారు. దేశంలోని అన్ని జాతులను యాత్ర ద్వారా ఏకం చేసి మోడీ సర్కార్ పేద ప్రజలకు చేస్తున్న అన్యాయాలను తెలియచేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ బ్లాక్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, వాడవాడలో ఇంటింటికీ యాత్ర చేరాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేబట్టబోయే పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఠాక్రే సూచించారు.