త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో బాటు 8 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్.ఎన్ ఆర్య వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, ఇతర కేంద్ర నాయకులు హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని త్రిపుర కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. మాణిక్ సాహా త్రిపుర సీఎం కావడం ఇది రెండో సారి. గత మూడు దశాబ్దాల్లో త్రిపురలో లెఫ్ట్ వ్యతిరేక ప్రభుత్వం అధికారాన్ని మళ్ళీ నిలుపుకోవడం ఇదే మొదటిసారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిధి సుబ్రతా చక్రవర్తి వ్యాఖ్యానించారు.
1988 లో కాంగ్రెస్-టీయుజెఎస్ కూటమి లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1993 లో కమ్యూనిస్టుల చేతిలో ఓటమి పాలయింది.
ఇక మాణిక్ సాహా 2016 లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2020లోరాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. గత ఏడాది మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లను, తిప్రా మోథా 13 స్థానాలను గెలుచుకున్నాయి. సీపీఎం 11, కాంగ్రెస్ 3 స్థానాలను దక్కించుకున్నాయి.