తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరగుతోంది. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారని వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ వాట్సాప్ గ్రూపు నుంచి కూడా ఎగ్జిట్ అయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఈ వార్తలపై మాణిక్కం ఠాకూర్ స్పందించారు. వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ ఎందుకు గ్రూపు నుంచి వైదొలిగారనే విషయంపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఏఐసీసీ గ్రూపులో కొనసాగుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
టీపీసీపీ చీఫ్ ఎంపిక నుంచి ఆయనపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు మాణిక్కం ఠాకూర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ సమయంలో పీసీపీ చీఫ్ పదవిని ఠాకూర్ అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. కనీసం నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోయారంటూ ఆయనపై ఆరోపణలు చేశారు.
సీనియర్ల అలక నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్‌ను అధిష్టానం రంగంలోకి దించింది. సీనియర్ నేతలతో ఆయన సంప్రదింపులు చేశారు. ఈ మేరకు వారు చెప్పిన విషయాలు, పార్టీ పరిస్థితులపై ఆయన ఓ నివేదికను తయారు చేశారు.
ఇక ఇప్పటికే సీనియర్లు అలక వహించడం, మరోవైపు తనపట్ల పార్టీలో పరిస్థితులను ఆయన గ్రహించారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ముందస్తుగా ఆయన అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఖర్గేను కలిసి పరిస్థితిని వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ దిగ్విజయ్ సింగ్ నివేదిక నేపథ్యంలో ఠాకూర్ తప్పించాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనతో అధిష్టానం రాజీనామా చేయించిందని వార్తలు వినిపిస్తున్నాయి.