– టీకాంగ్రెస్ లో అన్నీ సర్దుకున్నాయన్న థాక్రే
– రేవంత్, భట్టితో కలిసి ప్రెస్ మీట్
– కోమటిరెడ్డిపైనా ఇంట్రస్టింగ్ కామెంట్స్
– ఈనెల్లోనే మరోసారి రాష్ట్రానికి వస్తానని స్పష్టం
– హాత్ సే హాత్ యాత్రపై కీలక వ్యాఖ్యలు
– థాక్రేపై రేవంత్ ప్రశంసలు జల్లు
రెండు రోజులపాటు పలు సమావేశాలతో పార్టీ పరిస్థితులను అర్థం చేసుకున్న కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నేతలతో మాట్లాడి వారి ఆలోచనలు తెలుసుకున్నానని తెలిపారు. నేతల మధ్య అసంతృప్తి తొలగిపోయిందని.. పార్టీ పటిష్టత కోసం కలిసి పనిచేస్తామని వారంతా చేతిలో చేయి వేసి చెప్పారని వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర సాగుతుందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రెండు నెలల పాటు ఈ యాత్ర ఉంటుందని చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా అంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతీ జిల్లా, ప్రతీ బ్లాక్ లో రెండు నెలలపాటు యాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతి ఇంటికి భారత్ జోడో యాత్ర పోస్టర్, ప్రతి చేతికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేర్చే విదంగా ఈ యాత్ర సాతుందని థాక్రే వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ నెల 20వ తేదీన మళ్లీ వచ్చి.. మూడు రోజులు ఉంటానని పేర్కొన్నారు థాక్రే. 20, 21, 22 తేదీలలో ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర నేతలందరితో మరోసారి మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి పార్టీ నేతలందరూ ఐక్యంగా పని చేస్తారని చెప్పారు. నియోజకవర్గంలో బిజీగా ఉండటం వల్లే ఎంపీ కోమటిరెడ్డి సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. ఆయనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో జరిగే తదుపరి సమావేశాలకు ఆయన హాజరవుతారని వెల్లడించారు.
ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి థాక్రే పర్యటనతో కొత్త జోష్ వచ్చిందన్నారు. ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పారు. ముంబై బ్లాస్ట్, మతకల్లోలాల సమయంలో క్లిష్ట పరిస్థితులను హోంమంత్రిగా థాక్రే ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డి ఎలా పనిచేశారో శరత్ పవార్ హయాంలో థాక్రే అంతటి సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. మరోసారి పర్యటించి పూర్తి స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారన్నారు రేవంత్ రెడ్డి.