సీనియర్ల వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పరామర్శించారు. ఆమె నివాసానికి వెళ్లిన ఆయన ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
ప్రీతి వైద్య విద్యను అభ్యసించి ఎండీ కావాలనుకుందని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆయన అన్నారు. ర్యాగింగ్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఒక మెడికల్ కాలేజి విద్యార్థి చనిపోతే తోటి విద్యార్థులెవరూ ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విద్యార్థులు చాలా వరకు ఒత్తిడికి గురవుతున్నారని ఆయన చెప్పారు. ప్రీతి నాలుగు గంటల పాటు ఆపరేషన్ థియేటర్లో ఉందని, ఆ సమయంలో అసలు ఏం జరిగిందో ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతుంటే అసలు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఘటనకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.